సిరిసిల్ల బిడ్డ అక్షర.. జాతీయ క్రికెట్‌కు పయనం
పేదరికాన్ని అధిగమించి తెలంగాణ అండర్-19 జట్టులో చోటు
ప్రభుత్వ పాఠశాల నుంచి రాష్ట్ర జట్టుకు ఎంపిక
జమ్మూ కాశ్మీర్‌లో తెలంగాణ తరఫున బరిలోకి
ప్రతిభకు ప్రభుత్వం అండగా నిలవాలని పిలుపు
గ్రామీణ క్రీడా ప్రతిభకు అక్షర స్ఫూర్తి
తెలంగాణ ఉద్యమకారుల రాజన్న సిరిసిల్ల జిల్లా జేఏసీ చైర్మన్ గజ్జెల దేవరాజ్
కాకతీయ, సిరిసిల్ల: పేదరికాన్ని అధిగమించి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ క్రికెట్‌పై పట్టుదలతో సాధన చేసిన మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన బత్తుల అక్షర తెలంగాణ అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికైంది. త్వరలో జమ్మూ కాశ్మీర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ తరఫున బరిలోకి దిగనుంది. అక్షర 2025లో ఖమ్మంలో, 2026లో సంగారెడ్డిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చాటింది. తొలుత కరీంనగర్ జిల్లా అండర్-19 జట్టుకు ఎంపికైన ఆమె, తాజాగా తెలంగాణ రాష్ట్ర అండర్-19 జట్టులో స్థానం సంపాదించింది. సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాల పీఈటీ డేవిడ్ పర్యవేక్షణలో శిక్షణ పొందింది. తెలంగాణ ఉద్యమకారుల రాజన్న సిరిసిల్ల జిల్లా జేఏసీ చైర్మన్ గజ్జెల దేవరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో అక్షరను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ జాతీయ స్థాయికి ఎంపిక కావడం సిరిసిల్ల జిల్లాకు గర్వకారణమని దేవరాజ్ అన్నారు. అక్షరకు తనవంతుగా క్రికెట్ కిట్ అందిస్తానని తెలిపారు.

ప్రభుత్వ సహకారం అవసరం
జాతీయ స్థాయి పోటీలకు క్రీడా సామగ్రి, శిక్షణ, ప్రయాణ ఖర్చులు అవసరమని, ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అక్షరకు ఆర్థిక, క్రీడా ప్రోత్సాహం అందించాలని దేవరాజ్ కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు సరైన సమయంలో సహకారం అందిస్తే ఉన్నత స్థాయికి ఎదగగలరని అన్నారు. అక్షర విజయం గ్రామీణ క్రీడా ప్రతిభకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, క్రీడాభిమానులు పాల్గొని అక్షరకు అభినందనలు తెలిపారు.

