పేదల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు
50 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు
78 మందికి రూ.24.12 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు
కాకతీయ, చందుర్తి : పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు అందించి ఆత్మగౌరవంతో జీవించేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో గుడిసెల్లో నివసిస్తున్న అర్హులైన 50 పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. పట్టాలు పొందిన లబ్ధిదారులు నిర్మాణ పనులను ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించుకోవాలని సూచించారు. అనంతరం 78 మంది లబ్ధిదారులకు రూ.24.12 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

