సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి
నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం పూర్తి చేయాలి
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, సీఎంవో ఉన్నతాధికారులు
పనుల పురోగతిపై ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
మౌలిక వసతులపై అధికారులకు సూచనలు
కాకతీయ, వరంగల్: వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను వేగవంతం చేసి, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు సూచించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రవాణా, రోడ్లు, భవనాల శాఖ వికాస్‌రాజ్, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, సీఎంవో కార్యదర్శి కె.మాణిక్‌రాజ్, ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ శుక్రవారం ఆసుపత్రి నిర్మాణ ప్రాంగణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆసుపత్రిలో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతి, వివిధ విభాగాల నిర్మాణం, మౌలిక వసతులు, విద్యుత్, నీటి సరఫరా తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తయిన పనులను పరిశీలించి నాణ్యతను సమీక్షించారు. మిగిలిన పనులను ప్రణాళికాబద్ధంగా, సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణంలోని ప్రతి దశలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్దేశిత ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని సూచించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.
అత్యాధునిక వైద్య సేవలకు ఏర్పాట్లు
ఆసుపత్రి అందుబాటులోకి వచ్చిన అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా, పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందేలా అవసరమైన అన్ని ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలని ఉన్నతాధికారులు సూచించారు. మౌలిక వసతులు, విద్యుత్, నీటి సరఫరా తదితర అంశాల్లో ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ఉన్నతాధికారులకు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. సంబంధిత శాఖల అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

