అక్షర జ్ఞానంతో మహిళల్లో కొత్త వెలుగు..!!
చందుర్తిలో ‘అమ్మకు అక్షరమాల’.. ఉల్లాస్ పరీక్షలకు 687 మంది హాజరు..
కాకతీయ,చందుర్తి: మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో ఉత్సాహంగా సాగింది. ప్రగతి మండల సమాఖ్య (సెర్ప్) ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లో నిరక్షరాస్యులైన సంఘ సభ్యులకు ఉల్లాస్ పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షలకు మొత్తం 687 మంది హాజరై తమ అక్షరాస్యతను చాటుకున్నారు. చదవడం, రాయడం నేర్చుకోవాలనే పట్టుదలతో మహిళలు ఉత్సాహంగా పరీక్షల్లో పాల్గొన్నారు.
కార్యక్రమంలో సర్పంచులు, వార్డు సభ్యులు, డీపీఎం శ్రీనివాస్, ఏపీఎంలు, సీసీలు, వీఓఏలు, మండల సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. మహిళల్లో అక్షరాస్యత పెంపొందించడం ద్వారా కుటుంబాల్లోనూ, సమాజంలోనూ చైతన్యం పెరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

