ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం
నిర్ణీత గడువులోగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్లో ఆయన తన ఓటును నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు జరగనున్న 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లోని అర్హులైన పట్టభద్రులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి నిర్ణీత గడువులోగా నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని అన్నారు. ప్రస్తుతం 2 గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు కొత్త ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికలు జరగనున్న 2 నియోజకవర్గాల పరిధిలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా తమ ఓటు నమోదును త్వరగా పూర్తి చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, తమ పరిధిలోని అర్హులైన పట్టభద్రులకు ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని, పార్టీ శ్రేణులు సమన్వయంతో ఈ ప్రక్రియకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

