పారిశుద్ధ్యంలో జవాన్లదే కీలక పాత్ర
ప్రతి వార్డుపై జవాన్లు పూర్తి పట్టు సాధించాలి
నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు
జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న ఆదేశం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: నగర పారిశుద్ధ్య నిర్వహణలో జవాన్లదే కీలక బాధ్యత అని, ప్రతి జవాన్ తనకు కేటాయించిన వార్డుపై పూర్తి పట్టు సాధించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న ఆదేశించారు. మంగళవారం లాల్‌బహదూర్ కళాశాల ఆడిటోరియంలో జవాన్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతి జవాన్‌తో ప్రత్యేకంగా మాట్లాడి పారిశుద్ధ్య పరిస్థితులు, సిబ్బంది విధులు, చెత్త సేకరణపై ఆరా తీశారు. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే బయోమెట్రిక్ ద్వారా కార్మికుల హాజరు నమోదు చేయాలని, తడి, పొడి చెత్త వేర్పాటు, ఇంటింటి చెత్త సేకరణ, స్వచ్ఛ ఆటోల పనితీరుపై పూర్తి అవగాహనతో పనిచేయాలని సూచించారు. విలీన గ్రామాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైన చోట గ్యాంగ్‌మెన్‌ను వినియోగించుకోవాలని తెలిపారు. రోడ్లు, చెత్త పాయింట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలన్నారు. నెల రోజుల్లో పనితీరులో స్పష్టమైన మార్పు రావాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మెరుగైన పనితీరు కనబరిచిన జవాన్లకు ప్రశంసాపత్రాలతో మెరిటోరియస్ సర్వీస్‌గా గుర్తింపు ఇస్తామని తెలిపారు. సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, సానిటరీ సూపర్వైజర్లు గోల్కొండ శ్రీను, నరేందర్, అనిల్, భాస్కర్, సానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు పాల్గొన్నారు.

