గౌరవెల్లి పనులకు వేగం పెంచాలి..
భూసేకరణ పూర్తి చేసి.. పనులు పరుగులు పెట్టించాలి..
గౌరవెల్లి భూసేకరణకు గ్రీన్ సిగ్నల్..
పెండింగ్ సమస్యలు పరిష్కరించి పనులు ముందుకు..
భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌పై మంత్రుల ఫోకస్..
గౌరవెల్లి పూర్తికి సమన్వయంతో పనిచేయాలి.. గౌరవెల్లిపై మంత్రుల సమీక్ష
కాకతీయ, హైదరాబాద్ : గౌరవెల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సచివాలయం లో శనివారం గౌరవెల్లి ప్రాజెక్టు పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో వారు సమీక్ష సమావేశం నిర్వహించారు. భూసేకరణ, పునరావాసం, పర్యావరణ అనుమతులు, కాలువల పనులు, సవరించిన అంచనాలు, నీటి నిల్వలు తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా గౌరవెల్లి రిజర్వాయర్‌కు శంకుస్థాపన జరిగినట్లు అధికారులు మంత్రులకు వివరించారు. 2013 నాటికి సుమారు 57 శాతం పనులు పూర్తయ్యాయని, అనంతరం వివిధ పరిపాలనా కారణాలతో భూసేకరణలో జాప్యం జరిగిందని తెలిపారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించడంతో గణనీయమైన పురోగతి సాధించినట్లు వెల్లడించారు. మిగిలిన భూసేకరణను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. గౌరవెల్లి రిజర్వాయర్ కోసం భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.17 లక్షల చొప్పున పరిహారం అందించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న భూసేకరణ సమస్యలను త్వరగా పరిష్కరించాలని మంత్రులు సూచించారు. వివాహిత కుమార్తెలకు పునరావాస ప్రయోజనాలు కల్పించడం, పాత, కొత్త ముంపు ప్రాంతాల్లోని కుటుంబాలకు సంబంధించిన అంశాలపైనా సమావేశంలో చర్చించారు. కాలువలకు సంబంధించిన భూసేకరణ పురోగతిని కూడా సమీక్షించారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసి లబ్ధిదారులకు పరిహారం చెల్లింపులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మిగిలిన భూసేకరణను వేగంగా పూర్తి చేసి కాలువల పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని మంత్రులు ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించిన తాజా పర్యావరణ అనుమతులపైనా సమావేశంలో చర్చ జరిగింది. కేంద్ర సంస్థల మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన అనుమతులు పొందేందుకు చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.
భూసేకరణ, పునరావాసం, ధరల పెరుగుదల తదితర కారణాలతో గౌరవెల్లి రిజర్వాయర్, కాలువలకు సంబంధించిన సవరించిన అంచనాలను ప్రభుత్వానికి సమర్పించినట్లు వెల్లడించారు. మిగిలిన పనులకు పరిపాలనా అనుమతులు వచ్చిన వెంటనే టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంఎంఆర్ ప్యాకేజీ-3 పనులకు సంబంధించిన సవరించిన అంచనాలు, అదనపు నిర్మాణాల ప్రతిపాదనలు, భవిష్యత్ కార్యాచరణపై కూడా మంత్రులు సమీక్షించారు. అవసరమైన పర్యావరణ, ఇతర ప్రభుత్వ అనుమతులు పొందిన వెంటనే ప్రాజెక్టు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. భూసేకరణ, పునరావాసం, అనుమతులకు సంబంధించిన పెండింగ్ అంశాలను నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్, భూసేకరణ, పునరావాస కమిషనర్ శివకుమార్ నాయుడు, ఈఎన్‌సీ జనరల్ రమేష్ బాబు, ఈఎన్‌సీ ఓఅండ్‌ఎం మధుసూదన్‌రావు, జాయింట్ సెక్రటరీ కె.శ్రీనివాస్‌తో పాటు మూడు జిల్లాలకు చెందిన అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

