షార్ట్‌సర్క్యూట్‌తో సాయి ప్లాస్టిక్ స్క్రాప్ గోదాములో మంటలు
బొలేరో, రీసైక్లింగ్ మిషనరీ, స్క్రాప్ స్టాక్ దగ్ధం.. రూ.35 లక్షల ఆస్తి బూడిద
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ఏనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, చంద్రకళ కోల్డ్ స్టోరేజ్ సమీపంలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సాయి ప్లాస్టిక్ స్క్రాప్ గోదాములో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి సుమారు రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. బాధితుడు జుక్కు రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పక్క షెడ్డు యజమాని సూరం ప్రభాకర్‌రెడ్డి తన షెడ్డు కోసం కాంపౌండ్ వాల్ మీదుగా అనుమతి లేకుండా విద్యుత్ వైరు లాగారని ఆరోపించారు. 3 రోజుల క్రితమే వైరు నుంచి స్పార్క్స్ రావడాన్ని కార్మికులు గుర్తించి చెప్పడంతో ప్రభాకర్‌రెడ్డికి ఫోన్ చేసి తొలగించాలని కోరినా పట్టించుకోలేదన్నారు. శనివారం ఉదయం 8.22 గంటలకు షార్ట్‌సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించాయని తెలిపారు. ప్రమాదంలో రూ.8 లక్షల బొలేరో, రూ.10 లక్షల షెడ్డు, రూ.8 లక్షల రీసైక్లింగ్ మిషనరీ, రూ.5 లక్షల ప్లాస్టిక్ స్క్రాప్ స్టాక్, ఫర్నిచర్ దగ్ధమయ్యాయని పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ జవ్వాజి సురేష్ తెలిపారు.

