ప్రమాదాల నివారణకు నిరంతర నిఘా
గోల్డెన్ అవర్‌లో క్షతగాత్రులకు వైద్యం అందించాలి : సీపీ గౌష్ ఆలం
కాకతీయ, కరీంనగర్: వరంగల్–కరీంనగర్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్–563)పై ప్రయాణికుల భద్రత, ప్రమాదాల నివారణకు చేపట్టిన ఏర్పాట్లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొత్తగట్టు వద్ద ఏర్పాటు చేసిన హైవే పెట్రోలింగ్ యూనిట్, టోల్ ప్లాజా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌ను సందర్శించారు. అక్కడి సీసీ కెమెరాల పనితీరు, నిఘా వ్యవస్థ, కంట్రోల్ రూమ్ ద్వారా వాహనాల రాకపోకలను పర్యవేక్షించే విధానాన్ని పరిశీలించారు. ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో సమాచారం అందుకునే వ్యవస్థ, సంఘటనా స్థలానికి సిబ్బంది చేరుకునే విధానం, క్షతగాత్రులకు వైద్యసాయం అందించే చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జాతీయ రహదారిపై పెట్రోలింగ్ వాహనాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీపీ ఆదేశించారు. ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులను ‘గోల్డెన్ అవర్’లో ఆసుపత్రులకు తరలించేలా సమన్వయ వ్యవస్థను పటిష్ఠం చేయాలని సూచించారు. సీసీ కెమెరాల నిఘాను నిరంతరం పర్యవేక్షిస్తూ, అతివేగంగా వెళ్లే వాహనాలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై దృష్టి సారించాలన్నారు. వాహనదారులు నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీల్లో హుజూరాబాద్ ఏసీపీ మాధవి, రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కేశవపట్నం ఎస్ఐ శేఖర్, హైవే అథారిటీ ప్రతినిధులు, టోల్గేట్ నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.

