రక్తదానం మహోన్నత సేవ
దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం
కాకతీయ, కరీంనగర్: రక్తదానం మరొకరి ప్రాణాన్ని కాపాడే మహోన్నత సేవ అని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కరీంనగర్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు సకాలంలో రక్తం అందించడం కీలకమని సీపీ పేర్కొన్నారు. కుల, మత, ప్రాంత, లింగ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని సూచించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విధి నిర్వహణలో 47 మంది పోలీసు సిబ్బంది ప్రాణత్యాగం చేశారని, వారి సేవలు చిరస్మరణీయమని తెలిపారు. అమరవీరుల కుటుంబాలను గౌరవించడం అందరి బాధ్యతన్నారు. కార్యక్రమంలో ఏసీపీలు శ్రీనివాస్, శ్రీనివాస్ జి., వెంకటస్వామి, విజయకుమార్, స్వామి, ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారి డాక్టర్ ఉషారాణి, వైద్య బృందం పాల్గొన్నారు. రక్తదాతలకు సీపీ కృతజ్ఞతలు తెలిపారు.

