యాసంగిలో వరి సాగు వద్దు!
వానాకాలం పంటను కాపాడాలి.. తాగునీటికి ముందస్తు చర్యలు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రస్తుత వానాకాలం పంటను కాపాడాలని, యాసంగిలో వరికి బదులుగా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్లో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు దివాకర టీఎస్, అంకిత్లతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాసంగిలో సాగునీటి లభ్యత పరిమితంగా ఉండే అవకాశం ఉన్నందున పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయల సాగును ప్రోత్సహించాలని, విత్తనాలను ముందుగానే అందుబాటులో ఉంచాలని సూచించారు. వచ్చే ఏడాది జూలై వరకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, లీకేజీలను అరికట్టి పాత తాగునీటి పథకాలను పునరుద్ధరించాలని ఆదేశించారు. ఇంకుడు గుంతలు, బోరు రీచార్జి గుంతలు, వ్యవసాయ కుంటల నిర్మాణం చేపట్టాలని, పశుగ్రాసం కొరత నివారణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పత్తి, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, నీరు, విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించాలని సూచించారు. ఖమ్మం జిల్లాలో పది మండలాల్లో తీవ్ర కరువు, ఏడు మండలాల్లో సాధారణ కరువు పరిస్థితులున్నాయని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూగర్భ జలాలు 3.5 మీటర్లు తగ్గాయని కలెక్టర్ అంకిత్ వెల్లడించారు. సమావేశంలో సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

