భారతీయ కళల వారసత్వాన్ని కొనసాగించాలి
సెల్‌ఫోన్ బానిసత్వానికి పిల్లలు దూరంగా ఉండాలి
బాలల్లో సృజనాత్మకతను ప్రోత్సహించాలి
ఖమ్మం అడిషనల్ పోలీస్ కమిషనర్ రామానుజం
ఖమ్మంలో రాష్ట్రస్థాయి బాలోత్సవ్ ప్రారంభం
300 మందికి పైగా బాల కళాకారుల నృత్య ప్రదర్శనలు
కాకతీయ, ఖమ్మం బ్యూరో : భారతీయ కళల వారసత్వాన్ని ప్రతి తరం కొనసాగించాలని, పిల్లల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని జిల్లా అదనపు పోలీస్ కమిషనర్ రామానుజం పిలుపునిచ్చారు. సెల్‌ఫోన్ బానిసత్వానికి పిల్లలు దూరంగా ఉండాలని, కళలు నేర్చుకోవడం ద్వారా మానసికంగా, శారీరకంగా దృఢంగా ఎదుగుతారని పేర్కొన్నారు. బుధవారం భక్త రామదాసు కళాక్షేత్రంలో వారధి ఫౌండేషన్, ఖమ్మం డాన్సర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఖమ్మం బాలోత్సవ్ వేడుకలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. భారతీయ కళారూపాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయని, సంప్రదాయ జానపద కళలకు సినిమాల్లోనూ ప్రాధాన్యం పెరుగుతోందని తెలిపారు. సైబర్ నేరాల పట్ల కూడా పిల్లలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నృత్యాలతో అలరించిన చిన్నారులు
ఖమ్మం డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాయల నాగరాజు అధ్యక్షతన జరిగిన సభలో వారధి ఫౌండేషన్ చైర్మన్ చింతనిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ బాలోత్సవ్‌లో పాల్గొనడమే పిల్లలకు గొప్ప విజయమని, వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు అభినందనీయులని అన్నారు. తొలిరోజు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, నల్గొండ తదితర జిల్లాల నుంచి 300 మందికి పైగా బాలబాలికలు పోటీల్లో పాల్గొన్నారు. సంప్రదాయ జూనియర్, సీనియర్ విభాగాల్లో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. డిజిటల్ తెరలు, లైట్ల వెలుగుల్లో సంప్రదాయ వస్త్రధారణతో సంగీతానికి అనుగుణంగా చేసిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సోలో క్లాసికల్, ఫోక్ డాన్స్ విభాగాల్లో 200, గ్రూప్ క్లాసికల్, ఫోక్ డాన్స్ విభాగాల్లో 40, ఫ్యాన్సీ డ్రెస్ విభాగంలో 50 ఎంట్రీలు నమోదయ్యాయి.
విజేతలకు గురువారం బహుమతులు
గురువారం సాయంత్రం వరకు పోటీలు కొనసాగనున్నాయని, అనంతరం విజేతలకు బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఖమ్మంలో తొలిసారిగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి బాలోత్సవ్‌కు బాలబాలికల నుంచి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ కూరపాటి ప్రదీప్, డాక్టర్ జంగాల సునీల్‌కుమార్, గ్రంథాలయ చైర్మన్ ఖాదర్‌బాబా, డాక్టర్ కాటమనేని రాజకుమార్, నృత్యదర్శకుడు ఆర్.ఎన్.ప్రసాద్, న్యాయనిర్ణేతలు లింగం శ్రీనివాసరావు, జైపాల్, ఖమ్మం డాన్సర్స్ అసోసియేషన్ బాధ్యులు చిక్కుళ్ల వెంకటేష్, పగిల్లపల్లి రాజు, రాజేష్, భవానీశంకర్, ముకేశ్, నాని, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

