కొండాయిలో భూ రీ సర్వేను పరిశీలించిన తహసీల్దార్
హద్దుల నిర్ధారణలో అప్రమత్తంగా ఉండాలి
రైతుల సమక్షంలోనే సర్వే చేపట్టాలి
కాకతీయ, ములుగు: ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను తహసీల్దార్ జి. జగదీశ్వర్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, రైతులు, గ్రామ పెద్దలతో మాట్లాడి సర్వే నిర్వహణ తీరును సమీక్షించారు. భూముల హద్దులను సర్వేయర్లకు స్పష్టంగా చూపించాలని రైతులకు సూచించారు. సర్వే నిర్వహించే సమయంలో సంబంధిత భూముల చుట్టుపక్కల రైతులు సైతం అందుబాటులో ఉండేలా చూడాలని సర్వేయర్లకు తెలిపారు. రైతుల వారీగా భూముల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి రికార్డుల్లో ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని, లాంగిట్యూడ్, లాటిట్యూడ్ వివరాలను ఖచ్చితత్వంతో నమోదు చేయాలని సూచించారు. రీ సర్వే ప్రక్రియలో నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి భూమి హద్దును క్షేత్రస్థాయిలో నిర్ధారించుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గిర్దావర్లు సిహెచ్ . కిరణ్ కుమార్, ధనలక్ష్మి, జీపీఓ గంగరాజు, సర్పంచ్ మానస, మాజీ సర్పంచ్ కాక వెంకన్న, లైసెన్స్ సర్వేయర్లు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

