పక్కా సాక్ష్యాలతో నిందితులకు శిక్ష పడేలా చూడాలి!
దర్యాప్తులో లోపాలు లేకుండా ఛార్జిషీట్లు దాఖలు చేయాలి
ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశం
కాకతీయ, ఖమ్మం : పటిష్టమైన దర్యాప్తు, పక్కా సాక్ష్యాధారాల సమర్పణతో నిందితులకు న్యాయస్థానంలో శిక్ష పడేలా కృషి చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. గురువారం పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసుల విచారణ, ట్రయల్ ప్రక్రియలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, దర్యాప్తులో తలెత్తే లోపాలు, పొరపాట్లను గుర్తించి సరిదిద్దుకోవాలని సూచించారు. కేసులకు సంబంధించిన ఆధారాలను ఈ-సాక్ష్య యాప్‌లో నిబంధనల ప్రకారం నమోదు చేసి, నిర్ణీత గడువులో నాణ్యమైన ఛార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. తద్వారా బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
గంజాయి, అక్రమ ఇసుక రవాణాపై నిఘా
రోడ్డు ప్రమాద బాధితులకు గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్య చికిత్స అందించే పీఎం రాహత్ పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. గంజాయి వినియోగదారులను పట్టుకున్నప్పుడు వారికి సరఫరా చేస్తున్న వ్యక్తులు, ప్రధాన సూత్రధారులు, సరఫరా నెట్‌వర్క్ మూలాలను గుర్తించి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి జరిగే అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు చెక్‌పోస్టుల వద్ద నిరంతర తనిఖీలు చేపట్టాలన్నారు. పదేపదే నేరాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వారి కదలికలను పర్యవేక్షించాలని సూచించారు. సెకండ్‌హ్యాండ్ వాహనాల విక్రయదారుల వద్ద రిజిస్ట్రేషన్, యాజమాన్య బదిలీ పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సరైన ధ్రువపత్రాలు లేని వాహనాల విక్రయాలను అడ్డుకోవాలని ఆదేశించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తూ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతిరెడ్డి, శ్రీనివాసులు, సాంబరాజు, నరసింహారావు, సర్వర్, సత్యనారాయణ, సీఐలు పాల్గొన్నారు.

