ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి
-మండల ప్రత్యేక అధికారి వై.శ్రీకాంత్ రెడ్డి
కాకతీయ,రాయపర్తి: గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని మండల ప్రత్యేక అధికారి వై.శ్రీకాంత్ రెడ్డి అన్నారు.రాయపర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం అత్యంత రసవత్తరంగా,ప్రశాంత వాతావరణంలో జరిగింది.ఈ సమావేశానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన సర్పంచులు ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అధికారుల ముందుంచారు.ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ…ప్రజా ప్రతినిధులు సభ దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను అధికారులు పరిగణలోకి తీసుకోవాలని అన్నారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసినప్పుడే మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. తాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని,లో వోల్టేజ్ సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు,ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో ఎంపీడీవో పాక శ్రీనివాసులు,తహసీల్దారు ముల్కనూరి శ్రీనివాస్,ఎంపీఓ కూచన ప్రకాష్,వర్ధన్నపేట ఏఎంసి వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి,పిఏసిఎస్ చైర్మన్ కుందూరు రామచంద్రారెడ్డి,వివిధ శాఖల మండల స్థాయి అధికారులు,గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

