డ్రగ్స్, గంజాయి సంస్కృతికి బీజం వేసింది బిఆర్ఎస్ పాలనే!
*ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నాయకులు
కాకతీయ,చేర్యాల: గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలోనే తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ సంస్కృతి పెరిగిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మంజె మల్లేశం, పట్టణ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్ మండిపడ్డారు. బుధవారం చేర్యాల పట్టణంలోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు.బిఆర్ఎస్ పాలనలో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాపై వచ్చిన ఆరోపణలకు ఆ పార్టీ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కెటిఆర్ నుంచి గ్రామస్థాయి కార్యకర్తల వరకు డ్రగ్స్, గంజాయి వినియోగంపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్, గంజాయి మాఫియాను అరికట్టేందుకు ఈగల్ టీమ్లను ఏర్పాటు చేసి అక్రమ రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. యువత భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాలపై ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందన్నారు.జనగామ నియోజకవర్గంలో గతంలో ప్రశాంతమైన రాజకీయ వాతావరణం ఉండేదని, పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యవహారశైలితో వ్యక్తిగత విమర్శలు, అనవసర వివాదాలు పెరిగాయని విమర్శించారు. ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన నాయకులు చిల్లర రాజకీయాలకు పాల్పడటం తగదని హితవు పలికారు. ముందుగా గత పదేళ్ల పాలనపై ఆత్మపరిశీలన చేసుకోవాలని, నిరాధార ఆరోపణలు మానుకుని ఎమ్మెల్యే స్థాయికి తగిన హుందాతనంతో వ్యవహరించాలని సూచించారు.ఇకనైనా బాధ్యతారహిత వ్యాఖ్యలు మానుకోకపోతే ప్రజాక్షేత్రంలో తగిన రాజకీయ గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సహనాన్ని చేతగానితనంగా భావించవద్దని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

