పెన్షన్ కార్డుల పంపిణీలో రాజకీయ దుమారం!
* గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై ఎంపీ చామల ప్రశ్నల వర్షం..
* కాంగ్రెస్ కార్యకర్తలను ‘రౌడీలు, గంజాయి బ్యాచ్, తాగుబోతుల బ్యాచ్’ అంటూ ఫైర్!
* లబ్ధిదారుల కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య తోపులాట.. పోలీసుల లాఠీచార్జి!
కాకతీయ, చేర్యాల: పేదలకు అందించాల్సిన సంక్షేమ పథకాల కార్యక్రమం కాస్తా రాజకీయ రణరంగంగా మారింది. పెన్షన్ ప్రొసీడింగ్ కార్డుల పంపిణీ వేదికపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చేర్యాల పట్టణంలోని రేణుక గార్డెన్స్‌లో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య జరిగిన వాగ్వాదం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పలు అంశాలపై నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్నాయని ఆరోపణలు ఎదుర్కొన్న అవినీతి, అక్రమాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఎంపీ లేవనెత్తిన ప్రశ్నలతో ఇరువురు నేతల మధ్య వాగ్వాదం మొదలై క్రమంగా తీవ్రరూపం దాల్చింది.ఈ క్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ‘రౌడీలు, గంజాయి బ్యాచ్, తాగుబోతుల బ్యాచ్’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో అక్కడి వాతావరణం మరింత వేడెక్కింది. ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి బహిరంగ వేదికపై రాజకీయ కార్యకర్తలను ఉద్దేశించి ఇలాంటి పదజాలం ఉపయోగించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
ప్రజాప్రతినిధుల హోదాకు తగిన భాషను ఉపయోగించాల్సిన బాధ్యత లేదా? అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం కాస్తా తోపులాటకు దారితీయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు లాఠీచార్జి చేసినట్లు సమాచారం.పెన్షన్ కార్డులు అందుకుని సంతోషంగా వెళ్లాల్సిన లబ్ధిదారులు నేతల మధ్య రాజకీయ ఘర్షణతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పేదల సంక్షేమం కోసం నిర్వహించిన కార్యక్రమం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు, వ్యక్తిగత దూషణలతో రసాభాసగా మారింది. సంక్షేమ వేదికపై రాజకీయ సమరం.. ఎంపీ చామల నిలదీత.. పల్లా ఘాటు వ్యాఖ్యలు.. చివరకు పోలీసుల లాఠీచార్జి! ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాల్సిన వేదికపై నేతలు పరస్పర విమర్శలకు దిగడం, బహిరంగంగా పరుష పదజాలం ఉపయోగించడంపై చేర్యాల ప్రాంతంలో తీవ్ర చర్చ జరుగుతోంది.


