జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు కేశవపట్నం విద్యార్థి ఆది దుర్గ
విద్యార్థి ప్రతిభకు గ్రామస్థుల అభినందనలు.. ఉపాధ్యాయులకు ఘన సన్మానం
కాకతీయ,శంకరపట్నం: క్రీడల్లో ప్రతిభ చాటుతూ శంకరపట్నం మండలం కేశవపట్నం ఉన్నత పాఠశాల విద్యార్థి దుర్గం ఆది దుర్గ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో గ్రామ సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్, ఉపసర్పంచ్ ఆకుబత్తిని విజయ్ కుమార్ విద్యార్థి ఆది దుర్గతో పాటు ప్రధానోపాధ్యాయులు సుభాష్, ఫిజికల్ డైరెక్టర్ భక్తు రాజకుమార్లను శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.ప్రధానోపాధ్యాయులు సుభాష్ ప్రోత్సాహం, ఫిజికల్ డైరెక్టర్ భక్తు రాజకుమార్ అందించిన శిక్షణ, మార్గదర్శకత్వంతో ఆది దుర్గ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గ్రామానికి చెందిన విద్యార్థి జాతీయ స్థాయికి ఎదగడం గ్రామానికి గర్వకారణమని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానోపాధ్యాయులు సుభాష్ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను పాఠశాలలో నిర్వహించేందుకు ఆర్థిక సహకారం అందించిన సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్, ఉపసర్పంచ్ ఆకుబత్తిని విజయ్ కుమార్లకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా పాఠశాల తరఫున ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన సీనియర్ క్రీడాకారులు సైతం విద్యార్థి ఆది దుర్గను అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్, ఉపసర్పంచ్ ఆకుబత్తిని విజయ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు సుభాష్, ఫిజికల్ డైరెక్టర్ భక్తు రాజకుమార్, సీనియర్ క్రీడాకారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

