ఖమ్మం ప్రెస్ క్లబ్ వ్యవహారాలపై విచారణకు ఆదేశాలు
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం ప్రెస్ క్లబ్ నిర్వహణలో పారదర్శకత కోసం ఆడిటింగ్ నిర్వహించి ఎన్నికలు చేపట్టాలని టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు కోరగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సానుకూలంగా స్పందించి విచారణకు ఆదేశించారు. అవసరమైన చర్యల కోసం జిల్లా సహకార అధికారికి రిఫర్ చేసినట్లు తెలిపారు. సోమవారం ఐడీఓసీలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రెస్ క్లబ్ ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత పది సంవత్సరాల లావాదేవీలపై జర్నలిస్టుల సమక్షంలో ఆడిటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ నిర్వహణ పారదర్శకంగా లేదని, కొందరు యూనియన్లు అనధికారికంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆదాయం, ఖర్చుల వివరాలు, బిల్లులు, రశీదులు చూపకుండా అక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. వార్షిక బడ్జెట్ గణాంకాల్లో కూడా పారదర్శకత లోపిస్తోందని పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ నియమ నిబంధనలు అమలు కావడం లేదని తెలిపారు. 300 మందికి పైగా జర్నలిస్టులకు సంబంధించిన వ్యవహారాలను కొందరు స్వేచ్ఛగా నిర్వహిస్తున్నారని విమర్శించారు. బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. కలెక్టరేట్‌కు ర్యాలీగా చేరుకున్న ఫెడరేషన్ నాయకులు ముఖద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు దువ్వా సాగర్, నాయకులు కూరాకుల గోపీ, నలుబోల మధుశ్రీ, షేక్ జానీపాష, దగ్గుబాటి మాధవరావు, గణేష్, ఫయాజ్, అర్షద్, కొరకొప్పుల రాంబాబు, గోపీ, కె కిరణ్, యాకూబ్ పాష, పాష, యూసుప్, నాగలక్ష్మీ, ఉపేందర్, ప్రసాద్, షకీల్, సతీష్, పవన్, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

