తహసీల్దార్ కార్యాలయానికి తాళం
బదిలీలతో కీలక పోస్టులు ఖాళీ
ఇబ్బందులు ఎదుర్కొంటున్న రామగుండం ప్రజలు
కాకతీయ, పెద్దపల్లి/రామగుండం : అధికారుల కొరతతో తహసీల్దార్ కార్యాలయం కార్యకలాపాలు పూర్తిగా స్థంభించాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులను నియమించి సేవలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. రామగుండం తహసీల్దార్, ఉప తహసీల్దార్ బదిలీ కావడంతో కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహించే అధికారులు లేకుండా పోయారు. దీంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. శుక్రవారం పరిస్థితి మరింత దిగజారడంతో మిగిలిన సిబ్బంది కూడా కార్యాలయానికి తాళం వేసి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినట్లు సమాచారం.

సేవలు పూర్తిగా నిలిచిపోయాయి
ఆదాయ ధృవపత్రాలు, జనన మరణ ధృవపత్రాలు, భూ నమోదు ప్రక్రియలు నిలిచిపోయాయి. గత నెల రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు పనులు జరగక తిరిగి వెళ్తున్నారు. విద్యార్థులు, రైతులు, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాత్కాలికంగా అయినా బాధ్యతలు అప్పగించే అధికారి లేకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పరిపాలనలో ఏర్పడిన అంతరాయం వల్ల సాధారణ ప్రజల పనులు ఆగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తహసీల్దార్, ఉప తహసీల్దార్‌లను నియమించాలని కోరుతున్నారు.

