భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
శ్రీ దుబ్బ మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ రామారావు
కాకతీయ, జమ్మికుంట : శ్రీ దుబ్బ మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఆలయాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ఇంగిలే రామారావు ఆలయ చైర్మన్ అన్నారు. ధర్మారం పరిధిలోని శ్రీ దుబ్బ మల్లికార్జున స్వామి దేవస్థానం పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు ఆధ్వర్యంలో నూతన కమిటీకి ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ ముద్ధమల్ల రవీందర్‌తో పాటు పాలకవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఇంగిలే రామారావు మాట్లాడుతూ మహిమాన్వితమైన దుబ్బ మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. నూతన చైర్మన్‌తో పాటు పాలకవర్గ సభ్యులకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని దేవుడిని ప్రార్థించారు. దేవస్థానానికి వచ్చే భక్తులకు సౌకర్యాల పెంపుతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. దేవస్థానం అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని, భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సలీం, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, శ్రీనివాస్, అశోక్, నెల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

