ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలి
జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్
కాకతీయ, జగిత్యాల : ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో భాగంగా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి పరిశీలించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆరుగురు అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన ఎస్పీ, ఫిర్యాదులపై ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలీసు స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వినతులను స్వీకరించాలని సూచించారు. వాటిపై క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

