కాయకమే కైలాసం.. సమాజానికి మార్గదర్శకం
సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహోన్నత సంస్కర్త
కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్
కాకతీయ, కరీంనగర్: బసవేశ్వరుడు ప్రతిపాదించిన కాయకమే కైలాసం సిద్ధాంతం నేటికీ సమాజానికి మార్గదర్శకమని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పేర్కొన్నారు. నగరంలోని సుభాష్‌నగర్‌లో జగజ్యోతి మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు వీరశైవ లింగాయత్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీరశైవ మహాసభలో ఆయన మాట్లాడుతూ బసవేశ్వరుడు కులరహిత సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన మహోన్నత సంస్కర్త అని అన్నారు. స్త్రీ పురుష సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా మానవత్వాన్ని చాటిన మహనీయుడు బసవేశ్వరుడని కొనియాడారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వీరశైవ, లింగాయత్ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

