వయోవృద్ధుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ
జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత
ప్రణామ్ డే కేర్ సెంటర్‌లో ఉచిత వైద్య పరీక్షలు
బీపీ, షుగర్, థైరాయిడ్ టెస్టులు నిర్వహణ
అవసరమైన వారికి మందుల పంపిణీ
కాకతీయ, ములుగు : వయోవృద్ధుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధతో వైద్య సేవలు అందించాలని జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత సూచించారు. ములుగు జిల్లా కలెక్టర్ టి ఎస్ దివాకర ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని ప్రణామ్ డే కేర్ సెంటర్‌లో వయోవృద్ధులకు హెల్త్ క్యాంప్ నిర్వహించారు. రాయినిగూడెం పీ హెచ్ సీకి చెందిన డాక్టర్ నందకిషోర్, డాక్టర్ దీపికలతో కూడిన వైద్య బృందం వయోవృద్ధులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించడంతో పాటు థైరాయిడ్ సహా వివిధ పరీక్షల కోసం రక్త నమూనాలు సేకరించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. ఈ హెల్త్ క్యాంప్‌లో సుమారు 35 మంది వయోవృద్ధులు పరీక్షలు చేయించుకున్నారు. వయోవృద్ధులకు నిరంతర వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయ సహాయకులు నాగేంద్ర, ప్రణామ్ డే కేర్ సెంటర్ సూపరిండెంట్ చుంచు రమేష్, రాయినిగూడెం పీ హెచ్ సీ ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సులు, డే కేర్ సిబ్బంది పాల్గొన్నారు.

