పట్టణాల సమగ్ర అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాల అమలు
మౌలిక సదుపాయాలకు ప్రత్యేక నిధుల కేటాయింపు
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
కాకతీయ, గీసుగొండ : పట్టణాల సమగ్ర అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 15, 16వ డివిజన్లలో రూ.3 కోట్ల 26 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ధర్మారం ప్రాంతంలో మున్నూరు కాపు కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పేరుతో అవినీతి జరిగిందని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అనంతరం నూతన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్, టిపిసీసీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ గాదె దయాకర్, కొండేటి కొమురా రెడ్డి, గోదాసి చిన్న, ప్రవీణ్, దూపాకి సంతోష్, ల్యాదెళ్ళ సంపత్, దొమ్మాటి శంకర్, పుస్కూరి యాదగిరి, రామారావు తదితరులు పాల్గొన్నారు.

