అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ఇందిరమ్మ ఇళ్లను వేగంగా పూర్తి చేయాలి
రెండో విడత మంజూరుకు చర్యలు
మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి
కాకతీయ, చిగురుమామిడి : అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని, పేదలు ఎలాంటి ఆందోళన చెందవద్దని మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు బొంగోని రజిత, సంతోష్ల గృహప్రవేశ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, తహసీల్దార్ ముద్దసాని రమేష్, ఎంపీడీవో విజయ్ కుమార్, సర్పంచ్ జంగ శిరీష వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో 341 ఇందిరమ్మ ఇండ్లలో 288 ఇండ్లు స్లాబ్ స్థాయిలో ఉన్నాయని, వాటిని ఈ నెలాఖరులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిర్లక్ష్యం చేయకుండా యుద్ధ ప్రాతిపదికన ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ప్రభుత్వ ప్రోత్సాహాన్ని పొందాలని సూచించారు. త్వరలోనే రెండో విడతలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు. పార్టీలకు అతీతంగా, ఎలాంటి పైరవీలకు తావు లేకుండా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు.
లబ్ధిదారుల సత్కారం
అనంతరం ఇందిరమ్మ లబ్ధిదారులను శాలువాలు కప్పి, నూతన వస్త్రాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంగ శిరీష వెంకటరమణారెడ్డి, హౌసింగ్ ఏఈ విజయలక్ష్మి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మార్క రాజ్ కుమార్ గౌడ్, ఉపసర్పంచ్ మెడబోయిన రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఓరుగంటి భారతీదేవి, మహమ్మద్ కుతుబుద్దీన్, ఆలయ కమిటీ డైరెక్టర్ గందే రాజయ్య, గ్రామపంచాయతీ కార్యదర్శి గొల్లేని సంపత్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎలగందుల లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎనగందుల శివకుమార్, కాంగ్రెస్ నాయకులు కక్కర్ల వెంకటేశం, నూనెగొప్పల ఐలయ్య, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

