ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ
సొంత ఖర్చుతో మజ్జిగ పంపిణీ చేసిన ఎంపీడీవో
కేశవపట్నం బస్టాండ్‌లో సేవా కార్యక్రమం
కాకతీయ, శంకరపట్నం: పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు శంకరపట్నం ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్ మానవత్వాన్ని చాటుకున్నారు. మంగళవారం మండలంలోని కేశవపట్నం బస్టాండ్‌లో ఆయన ప్రయాణికులకు స్వచ్ఛందంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో, ఎంపీడీవో తన సొంత ఖర్చుతో మజ్జిగను ఏర్పాటు చేశారు. బస్టాండ్‌లో ఉన్న ప్రయాణికులతో పాటు ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ సిబ్బందికి కూడా ఆయన స్వయంగా మజ్జిగను అందజేశారు. ఒక ప్రభుత్వ అధికారి హోదాలో ఉండి కూడా సామాన్యుల కష్టాన్ని గుర్తించి సేవా కార్యక్రమం చేపట్టడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కంట్రోలర్ హనుమంతరావు, కార్గో ఏజెంట్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

