ఇసుక అక్రమ రవాణాదారుల బైండోవర్
గతంలో పట్టుబడిన వ్యక్తి మళ్ళీ దొరకడంతో రూ. లక్ష జరిమానా
నిందితులపై సస్పెక్ట్ షీట్ల నమోదు.. ట్రాక్టర్ల జప్తుకు సిఫార్సు
అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: సీఐ నిరంజన్ రెడ్డి
కాకతీయ, కరీంనగర్ రూరల్: కరీంనగర్ రూరల్ ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు తమ నిఘాను ఉధృతం చేశారు. ఇసుక మాఫియా కార్యకలాపాలను అరికట్టే దిశగా పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఇటీవల అక్రమంగా ఇసుక తరలిస్తూ పట్టుబడిన నగునూరి నాగరాజు, నగునూరి శ్రీనివాస్, దర్శనాల రాకేష్లను పోలీసులు ఎమ్మార్వో ముందు హాజరుపరిచారు. వీరు ఇకపై ఎటువంటి చట్టవ్యతిరేక పనులకు పాల్పడబోమని రూ. లక్ష పూచీకత్తు సమర్పించడంతో వారిని బైండోవర్ చేశారు.
ఈ కేసులో బొమ్మ కిరణ్ అనే వ్యక్తి తీరుపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. గతంలోనే అక్రమ ఇసుక రవాణా కేసులో పట్టుబడి బైండోవర్ అయినప్పటికీ, అతను మళ్లీ అదే నేరానికి పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను, అతనిని రూ. లక్ష జరిమానా బాండుపై ఎమ్మార్వో ముందు హాజరుపరిచారు. పదే పదే నేరాలకు పాల్పడుతున్న ఈ నలుగురిపై పోలీసులు సస్పెక్ట్ షీట్లు కూడా నమోదు చేశారు.
ట్రాక్టర్ల జప్తుకు సిఫార్సు
అక్రమ రవాణాకు నిందితులు ఉపయోగించిన ట్రాక్టర్లను శాశ్వతంగా జప్తు చేయాలని కోరుతూ మైనింగ్ శాఖకు పోలీసులు సిఫార్సు లేఖలు పంపారు. ఈ సందర్భంగా సీఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. మండల పరిధిలో ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, వారి వాహనాలను సీజ్ చేయడంతో పాటు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

