ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
పార్లమెంట్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన కృషి
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్న ఎంపీ
ప్రజా వేదిక ద్వారా అర్జీల స్వీకరణ
కాకతీయ, మంచిర్యాల: ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా వేదిక’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ. భాస్కర్, జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ, డీసీసీ ప్రతినిధి రఘునాథ్ రెడ్డిలతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు.
అభివృద్ధి పనుల వేగవంతం
ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. గత పదేళ్లలో జరగని అభివృద్ధిని ఈ రెండున్నర ఏళ్లలోనే చేసి చూపించామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను కేటాయించామని, క్షేత్రస్థాయిలో పనులు నాణ్యతతో, వేగంగా పూర్తయ్యేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
అధికారుల సమన్వయంతో పరిష్కారం
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు రెవెన్యూ, పోలీస్, రైల్వే వంటి వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని ఎంపీ వివరించారు. ఈ ప్రజా వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను వెంటనే పరిశీలించి, పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా పాలనలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా తనను కలవవచ్చని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

