కార్మిక హక్కుల పరిరక్షణకు పోరాటాలే మార్గం
కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్‌లతో శ్రామికులకు నష్టం
వారం రోజులు మేడే శ్రామిక సాంస్కృతిక వారోత్సవాలు
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య పిలుపు
కాకతీయ, గజ్వేల్ : శ్రామిక వర్గ హక్కుల కోసం సాగిన వీరోచిత పోరాటాల స్ఫూర్తిని చాటుతూ, మేడే శ్రామిక సాంస్కృతిక వారోత్సవాలను విజయవంతం చేయాలని సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య పిలుపునిచ్చారు. మే 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ వారోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. మంగళవారం గజ్వేల్‌లోని సీఐటీయూ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల స్వామి, జిల్లా కమిటీ సభ్యులు సందిటి రంగారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 1886లో అమెరికాలోని చికాగో నగరంలో ఎనిమిది గంటల పని దినం కోసం కార్మికులు చేసిన పోరాటాన్ని ఎల్లయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆనాడు ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో ఏడుగురు కార్మికులు అమరులయ్యారని, వారి త్యాగాల ఫలితంగానే ప్రపంచవ్యాప్తంగా కార్మిక హక్కులు సిద్ధించాయని తెలిపారు. 1917లో రష్యాలో శ్రామిక వర్గ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారిగా ఎనిమిది గంటల పని విధానం అమల్లోకి వచ్చిందని, అది ప్రపంచ కార్మికులకు మార్గదర్శకంగా నిలిచిందని వివరించారు.
లేబర్ కోడ్‌లపై ఆందోళన..
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న నూతన లేబర్ కోడ్‌ల వల్ల కార్మికుల హక్కులు కాలరాయబడుతున్నాయని ఎల్లయ్య ఆందోళన వ్యక్తం చేశారు. పని గంటలను 12 గంటలకు పెంచడం, ఈఎస్ఐ, పీఎఫ్, గ్రాట్యుటీ వంటి సామాజిక భద్రతలను బలహీనపరచడం వంటి చర్యలు శ్రామిక వర్గానికి గొడ్డలిపెట్టు అని విమర్శించారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులందరూ ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సాంస్కృతిక వారోత్సవాల్లో కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మిక సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

