స్వీయ నమోదు విధానానికి ప్రాధాన్యం
కేవలం 20 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తి
ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు అవకాశం
తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ. ఖాద్రీ
కాకతీయ, కరీంనగర్ : దేశంలో తొలిసారిగా చేపడుతున్న డిజిటల్ జనగణన ప్రక్రియలో భాగంగా ప్రవేశపెట్టిన స్వీయ నమోదు విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ. ఖాద్రీ కోరారు. గణాంక సిబ్బంది ఇంటికి రాకముందే కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే వీలుండటంతో ఈ విధానం ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనే మొబైల్ ఫోన్ ద్వారా ఇంట్లో కూర్చుని వివరాలను నమోదు చేయవచ్చని వివరించారు.
స్వీయ నమోదు విధానం ఇలా..
వివరాల నమోదు కోసం సంబంధిత జనగణన వెబ్‌సైట్‌ను సందర్శించి రాష్ట్రాన్ని ఎంపిక చేసి, నిర్ధారణ కోడ్ నమోదు చేసిన తరువాత ప్రవేశించాలని ఎం.ఏ. ఖాద్రీ సూచించారు. అనంతరం కుటుంబ యజమాని పేరు, మొబైల్ నంబర్ నమోదు చేసి, ధృవీకరణ కోసం వచ్చే ఒకసారి వినియోగించే సంకేత సంఖ్యను నమోదు చేయాలని తెలిపారు. తరువాత జిల్లా, పిన్ కోడ్, గ్రామం లేదా పట్టణం వివరాలతో పాటు మ్యాప్‌లో ఇంటి ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించి నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆపై ప్రశ్నావళిలో ఉన్న అన్ని వివరాలను పూరించి, అన్నీ సరిగా ఉన్నాయని నిర్ధారించిన తర్వాతే తుది సమర్పణ చేయాలని స్పష్టం చేశారు. సమర్పణ పూర్తయిన వెంటనే హెచ్ అక్షరంతో ప్రారంభమయ్యే 11 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య లభిస్తుందని, దానిని తప్పనిసరిగా భద్రపరచుకోవాలని ఎం.ఏ. ఖాద్రీ సూచించారు. గణాంక సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ఈ గుర్తింపు సంఖ్యను చూపించాల్సి ఉంటుందని తెలిపారు. వారు తమ యాప్‌లో నమోదు చేసినప్పుడు వివరాలు సరిపోతే గణన పూర్తైనట్లుగా పరిగణిస్తారని చెప్పారు. ఒకవేళ వివరాలు సరిపోకపోతే మళ్లీ మొదటి నుంచి వివరాలు సేకరించే అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు. ప్రజలందరూ ఈ డిజిటల్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

