రోడ్డును మింగేసి..ఆక్రమణలు
7వ వార్డు అక్రమ నిర్మాణాలు
రాకపోకలకు స్థానికుల తీవ్ర ఇబ్బందులు
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట పట్టణంలోని 7వ వార్డులో అక్రమ నిర్మాణాలు వెలిసి ప్రజలకు నరకం చూపుతున్నాయి. రహదారులను ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో కాలనీల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. వీధులు కుచించుకుపోవడంతో అత్యవసర సమయాల్లో అంబులెన్సులు, ఆటోలు సైతం లోపలికి రాలేని దుస్థితి నెలకొంది. ఎవరైనా మరణిస్తే వైకుంఠ రథం రావడానికి కూడా వీలులేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పన్నుల వసూళ్లలోనే ఉత్సాహం..
మున్సిపల్ అధికారులు పన్నుల వసూళ్లలో చూపుతున్న ఉత్సాహం అక్రమ నిర్మాణాల తొలగింపులో చూపడం లేదని కాలనీవాసులు మండిపడుతున్నారు. పన్నులు వంద శాతం వసూలు చేస్తున్న అధికారులు, రహదారుల ఆక్రమణలపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ వ్యవహారశైలిపై కాలనీల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ప్రాణ భద్రతకు ముప్పుగా మారిన ఆక్రమణలను తక్షణమే తొలగించాలని, రాకపోకలకు మార్గం సుగమం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

