కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలి
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లెలో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో పరిశీలన
కాకతీయ సిరిసిల్ల టౌన్ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర అందుతుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లె గ్రామంలో ఐకేపీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో కల్పించిన వసతులను పరిశీలించారు. ఎంత ధాన్యం వస్తుందని, గన్ని బ్యాగ్స్ పై నిర్వాహకులను ఆరా తీశారు. ధాన్యం తేమ శాతం, హమాలీలు ఎందరు ఉన్నారో అడిగి తెలుసుకున్నారు.జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో అన్ని వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్ తో శుభ్రం చేయించాలని సూచించారు. టార్పాలిన్లు అందుబాటులో ఉండాలని ధాన్యం కొనుగోలు చేసిన వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు.కేటాయించిన మిల్లులకు ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని రానున్న సీజన్ లో రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలని పిలుపు నిచ్చారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.
పరిశీలనలో జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, తహసీల్దార్ విజయ్ ప్రకాశ్ రావు, ఏపీఎం, ఏవో తదితరులు పాల్గొన్నారు.

