అంగన్‌వాడీల్లో ‘పోషణ పక్షం’ ముగింపు
సమతుల్య ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
ఇన్‌చార్జి సీడీపీఓ శ్రీలత
కాకతీయ, శంకరపట్నం: మండలంలోని మొలంగూర్-2, రాజాపూర్ అంగన్‌వాడీ కేంద్రాల్లో గురువారం ‘పోషణ పక్షం’ ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సూపర్‌వైజర్ పద్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు ఇన్‌చార్జి సీడీపీఓ శ్రీలత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సమతుల్య ఆహారం అత్యంత ఆవశ్యకమని ఆమె పేర్కొన్నారు. నిత్యం తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషక పదార్థాలు ఉండేలా చూసుకోవాలని తల్లులకు సూచించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాలు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నడుస్తున్నాయని తెలిపారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలను తల్లిదండ్రులు తప్పనిసరిగా అంగన్‌వాడీల్లోనే చేర్పించాలని కోరారు. ఇక్కడ లభించే పోషకాహారం మరియు ప్రీ-స్కూల్ విద్య పిల్లల భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ అరుణ, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలు మరియు చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.

