ఆర్టీసీ సమ్మెకు బీఎస్పీ సంపూర్ణ మద్దతు
హుజురాబాద్ డిపో వద్ద దీక్షలో పాల్గొన్న నాయకులు
శంకర్ గౌడ్ కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
కాకతీయ, హుజురాబాద్: రాష్ట్రవ్యాప్త ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకున్న నేపథ్యంలో, హుజురాబాద్ నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకులు కార్మికులకు తమ మద్దతు ప్రకటించారు. స్థానిక ఆర్టీసీ డిపో వద్ద నిర్వహిస్తున్న నిరసన దీక్షలో నాయకులు పాల్గొని, కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం గళమెత్తారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన కార్మికుడు శంకర్ గౌడ్ మృతిపై వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి రూ. 1 కోటి ఆర్థిక సాయంతో పాటు, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ దొడ్డే సమ్మయ్య, జిల్లా ఉపాధ్యక్షులు గిన్నారపు మహేందర్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ వేల్పుల మల్లేష్, డాక్టర్ అంబాల ప్రభాకర్, నియోజకవర్గ అధ్యక్షుడు మంద సమ్మయ్య, మారపల్లి మొగిలయ్య మరియు ఇతర నాయకులు రామ్ శ్రీనివాస్, మొలుగూరి రమేష్, మంద జగన్ తదితరులు పాల్గొన్నారు.

