మే డే ర్యాలీని విజయవంతం చేయండి
కార్మిక ఐక్యతే మన బలం : పిట్టల సమ్మయ్య
శంకరపట్నంలో మే డే పోస్టర్ ఆవిష్కరణ
కాకతీయ, శంకరపట్నం: ప్రపంచ కార్మికుల ఐక్యతకు ప్రతీకగా నిలిచే మే డే వేడుకలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పిట్టల సమ్మయ్య పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద 141వ మే డే వాల్ పోస్టర్‌ను ఆయన ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మిక హక్కుల సాధన, ప్రస్తుత సవాళ్లపై నాయకులు చర్చించారు. పిట్టల సమ్మయ్య మాట్లాడుతూ.. కార్మికులు ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న ఎనిమిది గంటల పనిదినం వంటి హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రస్తుతం అసంఘటిత రంగ కార్మికులు తక్కువ వేతనాలు, ఉపాధి లేమి, సంక్షేమ పథకాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్యంగా పోరాడితేనే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
మే 1న మండలంలోని ప్రతి గ్రామంలో కార్మికులు, రైతులు, కూలీలు, ఆటో యూనియన్ సభ్యులు ఎర్రజెండాలను ఆవిష్కరించి తమ ఐక్యతను చాటాలని కోరారు. అదేరోజు శంకరపట్నంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించబోయే భారీ ర్యాలీలో నిర్మాణ, హమాలీ కార్మికులు, వివిధ సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రేగుల కుమార్, గోదారి లక్ష్మణ్, ఎండీ బాదుల్లా, బొజ్జ సదానందం, మేకల పరమేష్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

