జనగణనలో ‘స్వీయ నమోదు’కు అవకాశం
నేటి నుంచి మే 10 వరకు వెబ్ పోర్టల్‌లో సౌలభ్యం
ఖచ్చితమైన వివరాలు నమోదు చేయాలి
: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
కాకతీయ, జనగామ : దేశవ్యాప్త జనగణన-2027 ప్రక్రియలో భాగంగా ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం ‘స్వీయ గణన’ (సెల్ఫ్ ఎన్యూమరేషన్)కు అవకాశం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన మీడియా అవగాహన కార్యక్రమంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. నేటి నుంచి మే 10వ తేదీ వరకు అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా ప్రజలు తమ కుటుంబ వివరాలను నమోదు చేయవచ్చని సూచించారు. మొబైల్ నంబర్, ఓటీపీ ఆధారంగా పోర్టల్‌లో లాగిన్ అయ్యి సులభంగా వివరాలు నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ వివరించారు. ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేక ఐడీ కేటాయించబడుతుందని పేర్కొన్నారు. “ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసినప్పటికీ, ఎన్యూమరేటర్లు గృహ సందర్శన చేసి ఆ వివరాలను మరోసారి ధృవీకరిస్తారు. నమోదు సమయంలో లొకేషన్, ఇతర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఫైనల్ సబ్మిట్ చేయాలి” అని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో ఖచ్చితమైన జనగణన జరగాలంటే ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు. సమాజ అభివృద్ధికి, ప్రభుత్వ పథకాల రూపకల్పనకు జనగణన సమాచారం అత్యంత కీలకమని, ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

