సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సహ సంఘచాలక్ సత్యనారాయణ
కాకతీయ, కరీంనగర్: హిందూ ధర్మం కేవలం మతం మాత్రమే కాదని, అది ఒక ఉన్నతమైన జీవన విధానమని ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సహ సంఘచాలక్ ఎలగందల సత్యనారాయణ పేర్కొన్నారు. మానకొండూర్ ఉప మండలంలో శ్రీరామ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘హిందూ సమ్మేళనం’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సనాతన ధర్మానికి భారతదేశమే శాశ్వత చిరునామా అని, ఇదే మన దేశానికి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపునిస్తుందని చెప్పారు. సమాజం సమగ్ర అభివృద్ధి సాధించాలంటే సత్యం, ధర్మం వంటి విలువలు ప్రతి ఒక్కరిలో ఉండాలని సత్యనారాయణ సూచించారు. “పంచ పరివర్తనల ద్వారా సమాజంలో ఆశించిన మార్పు తీసుకురావచ్చు. మన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలి. ధర్మ రక్షణలో హిందూ సమాజం ఐక్యంగా ముందుకు సాగాలి” అని ఆయన పిలుపునిచ్చారు. సమ్మేళనం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను, ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. మండుతున్న ఎండల దృష్ట్యా పాల్గొన్న వారికి నిర్వాహకులు అల్పాహారం, మజ్జిగ సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు సరఫ్ రామకృష్ణ, గర్రెపల్లి మహేశ్వర శర్మ, మహిళా వక్త అనుపమతో పాటు సదాశివపల్లి, మానకొండూర్, ముంజంపల్లి, లింగాపూర్ తదితర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

