రాష్ట్ర సాధనకు బీఆర్‌ఎస్ ఆవిర్భావమే మలుపు
కేసీఆర్ కృషితోనే నెరవేరిన తెలంగాణ కల
ములుగు జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి నాగ రమేష్
కాకతీయ, మంగపేట: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం ఒక కీలక మలుపు అని ములుగు జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బాడిశ నాగ రమేష్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగ రమేష్, మండల కార్యదర్శి గుండేటి రాజు యాదవ్‌తో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు నూనె లింగయ్య పార్టీ జెండాను ఆవిష్కరించారు.
మడమ తిప్పని పోరాటం..
ఈ సందర్భంగా నాగ రమేష్ మాట్లాడుతూ.. ఆంధ్ర పాలకుల అణచివేత నుంచి తెలంగాణను కాపాడుకునేందుకు, అమరవీరుల త్యాగాలను సాకారం చేసేందుకు కేసీఆర్ నడుం బిగించారని కొనియాడారు. “13 ఏళ్ల పాటు ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపి, ప్రాణాలకు తెగించి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేలా చేసి కోట్లాది ప్రజల చిరకాల కాంక్షను నెరవేర్చిన ఘనత జాతిపిత కేసీఆర్‌కే దక్కుతుంది” అని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ మేలు చేశాయని గుర్తు చేశారు. మళ్లీ అటువంటి పాలన రావాలంటే పార్టీ శ్రేణులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని, పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కర్రీ శ్రీను, నాగ, కొత్తమల్లూరు గ్రామ అధ్యక్షుడు మునిగేల సాంబులు, మహేష్, నిట్టా శ్యాం ప్రసాద్, బాడిశ నవీన్, మహిళా నాయకురాలు కాటూరి సుగుణ, సోషల్ మీడియా వారియర్ గుడివాడ శ్రీహరి, మునిగేల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

