కరీంనగర్ కాంగ్రెస్‌లో ‘వర్గ’ పోరు
డీసీసీ అధ్యక్షుడి ముందే కుమ్ములాట!
కార్పొరేషన్ టికెట్ల కేటాయింపుపై సీనియర్ల ఆగ్రహం
వేదికపైనే పరస్పర ఆరోపణలు.. ఉద్రిక్తత
సర్దిచెప్పేందుకు మేడిపల్లి సత్యం విఫలయత్నం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో గూడుకట్టుకున్న విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. నూతన డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అధ్యక్షతన జరిగిన తొలి సమావేశమే వర్గపోరుకు వేదికైంది. నాయకుల సమక్షంలోనే కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగడంతో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఈ పరిణామం కలకలం రేపింది. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో టికెట్ల పంపిణీలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని కొంతమంది సీనియర్ నాయకులు ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. పార్టీ కోసం దశాబ్దాలుగా జెండా మోస్తున్న తమను పక్కనపెట్టి, నిన్నగాక మొన్న వచ్చిన వారికి ప్రాధాన్యం కల్పించడమేమిటని నిలదీశారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య మాట మాట పెరగడంతో సమావేశం కాస్తా రణరంగంగా మారింది. వేదికపైనే నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది.
సమన్వయం చేసేందుకు పాట్లు
కార్యకర్తల మధ్య తోపులాట, అరుపులతో గందరగోళం నెలకొనడంతో డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం జోక్యం చేసుకున్నారు. అందరినీ శాంతింపజేసేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది. “మనలో మనకు విభేదాలు ఉంటే పార్టీ వేదికలపై చర్చించుకోవాలి తప్ప ఇలా రచ్చకెక్కడం సరికాదు. అందరం కలిసికట్టుగా ఉంటేనే పార్టీ బలపడుతుంది” అని ఆయన హితవు పలికారు. సత్యం హామీతో కార్యకర్తలు కాస్త శాంతించినప్పటికీ, అంతర్గతంగా నెలకొన్న అసమ్మతి మాత్రం చల్లారలేదు.
ఐక్యతపై నీలినీడలు
రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ, కీలకమైన కరీంనగర్ జిల్లాలో వర్గపోరు బహిర్గతం కావడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు రానున్న రాజకీయ సవాళ్లను ఎదుర్కోవాల్సిన తరుణంలో, ఇలాంటి అంతర్గత కుమ్ములాటలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వర్గపోరుకు అధిష్టానం ఇప్పుడైనా చెక్ పెడుతుందో లేదో వేచి చూడాలి.

