29న తాడికల్‌లో పూర్వ ప్రజాప్రతినిధులకు సన్మానం
గ్రామ అభివృద్ధిలో భాగస్వాములైన వారికి గౌరవం
సర్పంచ్ దుర్గపు సుజాత-తిరుపతి
కాకతీయ, శంకరపట్నం: మండలంలోని తాడికల్ గ్రామంలో పూర్వ ప్రజాప్రతినిధుల సేవలను స్మరించుకుంటూ ఈనెల 29న (బుధవారం) ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఈ వేడుక జరగనుంది. గతంలో తాడికల్ గ్రామ ప్రజల చేత ఎన్నికై జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ మరియు సర్పంచ్‌లుగా బాధ్యతలు నిర్వహించి, గ్రామాభివృద్ధికి విశేష కృషి చేసిన వారిని ఈ సందర్భంగా సత్కరించనున్నట్లు సర్పంచ్ దుర్గపు సుజాత-తిరుపతి తెలిపారు. గ్రామ ప్రగతిలో వారి అనుభవాన్ని, సేవలను గుర్తించి గౌరవించుకోవడం మన బాధ్యతని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం సర్పంచ్ సౌజన్యంతో నిర్వహించబడుతుందని, గ్రామ ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

