ఆర్టీసీ కార్మికుల హామీని నెరవేర్చిన సీఎం
జీపీపీ డిపో వద్ద కార్మికుల సంబరాలు
సీఎం, మంత్రి పొన్నం చిత్రపటాలకు పాలాభిషేకం
హాజరైన డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట అంక్షారెడ్డి
కాకతీయ, గజ్వేల్: అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారని సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట అంక్షారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని జీపీపీ డిపో వద్ద కార్మికులు నిర్వహించిన సంబరాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు కార్మికులతో కలిసి పాలాభిషేకం చేశారు. అంక్షారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం ప్రస్తుత ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు. జూన్ 2వ తేదీన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు, 10 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్మికుల సుదీర్ఘకాలపు 31 డిమాండ్లలో 28 అంశాలకు ఏకకాలంలో పరిష్కారం చూపడం శుభపరిణామమని కొనియాడారు. ఆర్టీసీలో కార్మిక సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అంగీకరించడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదని ఆమె మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పెద్దిరెడ్డి అశోక్ రెడ్డి, మాజీ కో-ఆప్షన్ సభ్యులు షరీఫ్, పట్టణ పార్టీ అధ్యక్షులు మొనగారి రాజు, రాములు గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు సుఖేందర్ రెడ్డి, నేతలు జహీర్, గుంటూకు శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

