మహిళలను వేధిస్తే ఉపేక్షించం
: షీ టీం ఎస్సై శ్రీరాములు
కాకతీయ, గజ్వేల్: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆదేశాల మేరకు గజ్వేల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ ఆధ్వర్యంలో బుధవారం మహిళలు, పిల్లల రక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మాతా శిశు సంరక్షణ కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి గజ్వేల్ షీ టీం ఎస్సై శ్రీరాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొనే సవాళ్లపై ఎస్సై శ్రీరాములు అవగాహన కల్పించారు. తోటి ఉద్యోగులు లేదా బయటి వ్యక్తుల ద్వారా ఎదురయ్యే మానసిక, శారీరక వేధింపులను ఏమాత్రం భరించవద్దని, లైంగిక వేధింపులకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే పై అధికారులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అత్యవసర సమయాల్లో 100 లేదా 112 నంబర్లకు ఫోన్ చేయాలని, ఫిర్యాదు అందిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఆసుపత్రిలో భద్రత పెంచాలి..
అనంతరం సూపరింటెండెంట్ డాక్టర్ సుశీల రత్నం మాట్లాడుతూ.. రాత్రి సమయాల్లో ఆసుపత్రిలో ఎదురవుతున్న ఇబ్బందులను పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. మద్యం సేవించి వచ్చే గుర్తుతెలియని వ్యక్తులు, చిన్న దొంగతనాలకు పాల్పడే వారి వల్ల అలజడి నెలకొంటుందని, పోలీసుల గస్తీ పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఎం.ఓ డాక్టర్ మంజుల, సీనియర్ ఫార్మసీ ఆఫీసర్ విమల, హెడ్ నర్సులు వకుళాదేవి, నిర్మల, ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సింగ్ ఆఫీసర్ రజిత, హెల్త్ అసిస్టెంట్ దేవసాని వాసుదేవ్, పోలీస్ సిబ్బంది రామచంద్రారెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

