స్వచ్ఛ సర్వేక్షన్-2026లో అగ్రస్థానమే లక్ష్యం
100% వ్యర్థాల వర్గీకరణతో మెరుగైన ర్యాంకుకు చర్యలు
పౌర భాగస్వామ్యంతో నగరాన్ని తీర్చిదిద్దాలి
నగరపాలక కమిషనర్ ప్రఫుల్ దేశాయ్
కాకతీయ, కరీంనగర్: నగర పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరిచి “స్వచ్ఛ సర్వేక్షన్–2026”లో ఉత్తమ ర్యాంకు సాధనే లక్ష్యంగా పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం నగరపాలక సంస్థ ఆవరణలోని కళాభారతి సభాగృహంలో పారిశుధ్య, ఇంజినీరింగ్ అధికారులు, మెప్మా సిబ్బందితో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ ర్యాంకింగ్‌లో ముందంజలో ఉండేందుకు ప్రతి డివిజన్‌లో వ్యర్థాల సేకరణను క్రమబద్ధీకరించాలని కమిషనర్ ఆదేశించారు. ఇళ్ల వద్దే తడి, పొడి, శానిటరీ, హాజార్డస్ వ్యర్థాలను 100 శాతం వేరు చేసేలా చూడాలని, హోం కంపోస్టింగ్, డీఆర్‌సీసీ, ఆర్‌ఆర్‌ఆర్ సెంటర్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై చెత్త వేసే వారిపై జరిమానాలు విధించాలని స్పష్టం చేశారు.
పౌరుల భాగస్వామ్యం ముఖ్యం
నగరాన్ని స్వచ్ఛంగా ఉంచడంలో పౌరుల పాత్ర కీలకమని, ఎస్‌హెచ్‌జీ మహిళలు, విద్యార్థుల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని కమిషనర్ తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో డస్ట్‌బిన్లు, కంపోస్టింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని, ప్రజా మరుగుదొడ్లను నిరంతరం తనిఖీ చేస్తూ పరిశుభ్రతను కాపాడాలని ఆదేశించారు. అలాగే స్వీయ గణన, ఓటర్ మ్యాపింగ్ పనులను సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ సువార్త, డిప్యూటీ కమిషనర్ వేణు, ఎస్‌ఈ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

