కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలను గద్దె దింపాలి
హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలి
సీపీఎం జిల్లా నేత ఎం.డి. దావూద్ పిలుపు
ఏటూరునాగారంలో ఘనంగా మే డే వేడుకలు
కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : కార్మికులు ఐక్యంగా సంఘటితమై కార్మిక వ్యతిరేక ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి. దావూద్ పిలుపునిచ్చారు. మే డే సందర్భంగా మండల కేంద్రంలోని వై జంక్షన్, ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పలు గ్రామాల్లో సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ మండల కార్యదర్శి చిటమట రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో దావూద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎర్రజెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దావూద్ మాట్లాడుతూ.. వేలాది మంది కార్మికుల త్యాగ ఫలితంగా సాధించుకున్న 8 గంటల పని హక్కును ప్రస్తుత పాలకులు కాలరాస్తున్నారని విమర్శించారు. పనిగంటలను 12 గంటలకు పెంచే కుట్రలు చేస్తున్నారని, కనీస వేతనం, ఉద్యోగ భద్రత లేక కార్మికులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌తో కార్మిక వర్గంపై దోపిడీ మరింత పెరుగుతోందని మండిపడ్డారు. తక్షణమే లేబర్ కోడ్స్‌ను రద్దు చేసి పాత చట్టాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వాలపై పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ఎల్. రవి, సీఐటీయూ నాయకులు, వైద్య సిబ్బంది మరియు సుమారు 40 మంది కార్మికులు పాల్గొన్నారు.

