యూరోకిడ్స్ చొరవ.. బాటసారులకు చల్లని నీడ
నగరంలో రెండు చోట్ల చలివేంద్రాల ఏర్పాటు
ప్రారంభించిన కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ
కాకతీయ, కరీంనగర్: భానుడి భగభగలతో అల్లాడుతున్న నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు యూరోకిడ్స్ ప్రీస్కూల్ కరీంనగర్ సామాజిక బాధ్యతగా ముందుకొచ్చింది. పెరుగుతున్న వేడిగాలుల నుంచి ఉపశమనం కలిగించేందుకు నగరంలోని రెండు ప్రధాన ప్రాంతాల్లో ఉచిత తాగునీటి కేంద్రాలను (చలివేంద్రాలు) ఏర్పాటు చేసింది. శనివారం భగత్‌నగర్‌లోని మల్లమ్మ మార్కెట్ వద్ద, రామచంద్రపూర్ కాలనీలోని కనకయ్య హోటల్ సమీపంలో వీటిని ప్రారంభించారు.
సేవలో భాగస్వామ్యం..
మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ కార్పొరేటర్, బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ ఈ కేంద్రాలను ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. తీవ్రమైన ఎండల వల్ల ఇబ్బంది పడుతున్న పాదచారులు, రోజువారీ ప్రయాణికులు, చిరువ్యాపారుల కోసం ఈ చలివేంద్రాలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడంలో భాగంగా సమాజానికి అండగా నిలవాలనే సంకల్పంతోనే ఈ చొరవ తీసుకున్నట్లు యూరోకిడ్స్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

