భక్తిశ్రద్ధలతో ‘గోటి’ తలంబ్రాల తయారీ
ధర్మారంలో కనులపండువగా సీతారాముల కల్యాణ ఏర్పాట్లు
శ్రీవారి సేవలో తరించిన మహిళలు, మాలధారులు
కాకతీయ, శంకరపట్నం: మండలంలోని ధర్మారం (కన్నాపూర్) గ్రామంలో వెలసిన శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత వాలి–సుగ్రీవ దేవస్థానంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈనెల 9న నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ వేడుకలో భాగంగా శనివారం నిర్వహించిన ‘గోటి తలంబ్రాల’ తయారీ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామ సర్పంచ్ చింతి రెడ్డి పద్మ ఆధ్వర్యంలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో సంప్రదాయ పద్ధతిలో వడ్లను చేతి గోటితో వలిచి తలంబ్రాలను సిద్ధం చేశారు. యంత్రాల సాయం లేకుండా, స్వామివారిపై భక్తితో మహిళలే స్వయంగా తలంబ్రాలు తయారు చేయడం విశేషం. ఈ అపురూప ఘట్టాన్ని చూసేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈనెల 9న జరిగే కళ్యాణ మహోత్సవానికి పరిసర గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో నిర్వాహకులు అన్ని సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కన్నాపూర్, ధర్మారం గ్రామాలకు చెందిన ఆంజనేయ స్వామి మాలధారణ భక్తులు, మహిళలు మరియు గ్రామ పెద్దలు పాల్గొని స్వామివారి సేవలో తరించారు.

