రెడ్ క్రాస్‌లో ప్రతి ఒక్కరూ సభ్యులు కావాలి
మానవ సేవే మాధవ సేవ : కలెక్టర్ దివాకర టీఎస్
ఖమ్మం కలెక్టరేట్‌లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు
సభ్యత్వ నమోదుకు వైద్యులు, ఉద్యోగులు ముందుకు రావాలని పిలుపు
కాకతీయ, ఖమ్మం: జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో పనిచేసే రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు జిల్లాలోని సుమారు 15 ప్రధాన శాఖలకు ప్రత్యేక లక్ష్యాలను నిర్దేశించినట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్‌లో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసి, దరఖాస్తుదారులకు వెసులుబాటు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమ సమన్వయం కోసం ఒక జిల్లా స్థాయి నోడల్ అధికారిని కూడా నియమించినట్లు పేర్కొన్నారు. మెడికల్ కాలేజీ వైద్యులు, ప్రైవేట్ డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున సభ్యత్వం పొంది సంస్థకు అండగా నిలవాలని కోరారు. సభ్యత్వం పొందగోరే వారు మరిన్ని వివరాల కోసం 9885581603, 9440003535, 9908153033 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో డాక్టర్ వి. చంద్రమోహన్, కె. నర్సయ్య, జనార్ధన్ రావు, హరి, కె.ఎస్.ఎన్ రెడ్డి, వెంకటేశ్వర్లు, సీపీఓ శ్రీనివాస్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

