వెయ్యి కార్లు.. 250 బస్సులు మోదీ సభకు భారీ సమీకరణ
కరీంనగర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర మంత్రి బండి సంజయ్
కాకతీయ, కరీంనగర్: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈనెల 10న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభను భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చుట్టుపక్కల జిల్లాల నుండి భారీ ఎత్తున జనాన్ని సమీకరించే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి అత్యధిక సంఖ్యలో జన సమీకరణ చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేక దృష్టి సారించారు.
గత నాలుగు రోజులుగా కరీంనగర్‌లోనే మకాం వేసి ఇతర కార్యక్రమాలను పక్కనపెట్టి పార్టీ నేతలతో జన సమీకరణపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం విడతలుగా మీటింగ్‌లు జరుపుతూ గ్రామాల వారీగా వార్డు సభ్యులు, ఉప సర్పంచులు, సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులతో చర్చలు కొనసాగిస్తున్నారు.
మరోవైపు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, కంటెస్టెడ్ కార్పొరేటర్లతోనూ సమావేశాలు నిర్వహించారు. జిల్లాల వారీగా మండలాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులతోనూ భేటీ అయ్యారు. గ్రామాలు, మండలాలు, మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్ల వారీగా జన సమీకరణ లక్ష్యాలను నిర్దేశించారు. మండలాల వారీగా ఇంఛార్జీలను నియమించారు.

మోదీ సభ సమీకరణలో భాగంగా రాష్ట్ర నాయకత్వం కూడా జిల్లాల వారీగా ఇంఛార్జీలను నియమించింది. అందులో భాగంగా కరీంనగర్ జిల్లా ఇంఛార్జీగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, సిరిసిల్ల జిల్లా ఇంఛార్జీగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి నియమితులయ్యారు. వారు జిల్లాల వారీగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ, మండలాల వారీగా అవసరమైన బస్సులు, కార్ల వివరాలను సేకరించారు.
ఈ వివరాల ప్రకారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి వెయ్యి కార్లు, 250 బస్సులను ఏర్పాటు చేసి వేలాది మందిని మోదీ సభకు తరలించాలని నిర్ణయించారు. చాలా గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం రావడంతో వారికి రవాణా, తాగునీరు, భోజన సదుపాయాలు కల్పించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఏ పరిస్థితుల్లోనూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం జన సమీకరణలో అగ్రస్థానంలో నిలవాలని సూచించారు.
సికింద్రాబాద్‌లో మకాం.. నగరంపై ఫోకస్
మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం నుండి సికింద్రాబాద్‌లోనే మకాం వేయనున్నారు. పరేడ్ గ్రౌండ్ సభకు సిటీ నుంచే భారీగా జనాన్ని సమీకరించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. నగరంలోనూ పెద్దఎత్తున జన సమీకరణకు ప్రణాళిక సిద్ధం చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు ముషీరాబాద్ అసెంబ్లీ నేతలతో బర్కత్‌పురాలోని సిటీ కార్యాలయంలో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మన్ హాజరుకానున్నారు. సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలోని సురభి గార్డెన్స్‌లో ముఖ్య కార్యకర్తలతో సమావేశం జరగనుంది.
అదేవిధంగా ఎల్లుండి పార్టీ కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం పాదయాత్ర ద్వారా ఇంటింటికీ వెళ్లి సభకు ఆహ్వానించేలా షెడ్యూల్ రూపొందించారు. నగరంలోని బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు తమ తమ డివిజన్లలో ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి మోదీ సభకు ఆహ్వానించాలని సూచించారు

