అకాల వర్షాలు… ధాన్యం కొనుగోళ్లు ఆగకూడదు
తడిసిన ధాన్యం కూడా స్వీకరించాలి
చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశం
కాకతీయ, పెద్దపల్లి : జిల్లాలో అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు ఎక్కడా నిలిచిపోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం అర్ధరాత్రి కురిసిన వర్షాల ప్రభావంపై బుధవారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో రైతుల వద్ద ఉన్న చివరి గింజ వరకు మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించవద్దని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కొనుగోళ్లను వేగవంతం చేసేందుకు ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించారు.
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టి సమీప పీపీసీ కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కేంద్రాల్లో తగినంత తార్పాలిన్‌లు అందుబాటులో ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలని తెలిపారు.
ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని, ప్రతి గింజ కొనుగోలు చేస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు.
ఈ సమీక్షలో డీసీఓ మాల, సివిల్ సప్లై డీఎం శ్రీకాంత్, డీఎస్ఓ శ్రీనాథ్, డీఎంఓ ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

